తెలంగాణ అమ్మాయి, ఎన్నారై యువకుడికి మధ్య జరిగిన అందమైన ప్రేమకథగా ఫిదా చిత్రాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కుటుంబపరమైన భావోద్వేగాలు చక్కగా పండాయి. అక్కాచెల్లెలు, తండ్రి కూతుళ్లు, అత్తా కోడళ్ల మధ్య బంధాలు, అనుబంధాలను చక్కగా చూపించారు. కుటుంబంలో ఉండే ప్రేమానురాగాలను అద్భుతంగా చిత్రీకరించారు.
ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ ప్రకారం.. ఫిదా చిత్రం పంపిణీదారులకు ఇప్పటికే భారీ లాభాలను తెచ్చిపెడుతున్నది. వారాంతానికి ఈ చిత్రం రూ.25 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం వారాంతానికే ఈ చిత్రం కలెక్షన్లు టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులుపుతున్నట్టు తెలుస్తున్నది.
ఫిదా చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. అమెరికాలో ఇప్పటికే మిలియన్ డాలర్స్ క్లబ్‌లో చేరింది. విడుదలైన రెండు రోజుల్లోపే మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఈ సినిమాకు వస్తున్న ఆదరణను చెప్పకనే చెప్పింది.
వారాంతానికి అంటే ఆదివారం నాటికే కలెక్షన్లు రచ్చ రచ్చగా ఉన్నాయి. మౌత్ టాక్‌తో ఈ చిత్రం కలెక్షన్లు భారీగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని వర్గాల నుంచి ఈ చిత్రానికి సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. వచ్చే వారం రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది.
ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకర్షిస్తున్న ఫిదా చిత్రాన్ని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రత్యేకంగా చూశారు. సినిమా చక్కగా ఉంది. దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్‌రాజు అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరక్కించారు. నటీనటులు చక్కగా నటించారు అని సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. వీలు చూసుకొని చిత్ర యూనిట్ తనను కలువాలని సీఎం ఆహ్వానించడం గమనార్హం.
ఏకంగా సీఎం కేసీఆర్ ప్రశంసలు అందుకొన్న ఈ చిత్రంపై మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ సినిమాలు ఎక్కువగా చూడరు. అలాంటింది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ నేపథ్యం ఉన్న చిత్రం గురించి గొప్పగా చెప్పుకొంటున్న క్రమంలో ఈ చిత్రాన్ని చూసినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రంపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించడంపై చిత్ర నిర్మాత, దర్శకులు సంతోషంలో మునిగినట్టు తెలుస్తున్నది.
Comments
Post a Comment